PM Modi Vizag Tour: మోదీ విశాఖ టూర్.. మైలేజీ కోసం వైసీపీ ప్రయత్నాలు..
ప్రధాని నరేంద్రమోదీ చాలా సంవత్సరాల తరువాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఏపీకి వస్తున్నారు. విశాఖ పట్నం కేంద్రంగా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు.
Vizag: ప్రధాని నరేంద్రమోదీ చాలా సంవత్సరాల తరువాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఏపీకి వస్తున్నారు. విశాఖ పట్నం కేంద్రంగా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. దాంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీ అపుడే తన ప్రయత్నాలు మొదలెట్టింది అని అంటున్నారు పరిశీలకులు.
ఈ నెల 12న ప్రధాని మోదీ విశాఖలో రైల్వే జోన్ ప్రధాన ఆఫీస్ కి శంకుస్థాపన చేస్తారు. అలాగే నాలుగు వందల కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దీంతో పాటుగా భీమిలీ నియోజకవర్గంలో ఐఐఎం భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇంకా భోగాపురం ఎయిర్ పోర్టు, విజయనగరంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయం భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొంటారని సమాచారం. వేల కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో ప్రారంభం కాబోతున్నాయి. దాంతో పాటు విశాఖ వాసుల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ కి మోదీ శంకుస్థాపన చేయడం అంటే పొలిటికల్ గా మైలేజ్ ని ఇచ్చే అంశం. దాంతో మోదీ విశాఖ సభను తమకు అనుకూలంగా చేసుకోవడానికి వైసీపీ చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
నవంబర్ 12న మోదీ విశాఖ ఏయూలోని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ఆ సభలో పాలుపంచుకుంటారు. దాంతో మోదీ సభను పూర్తిగా వాడుకోవడానికి వైసీపీ రెడీ అయింది అంటున్నారు. ఈ సభకు కనీ వినీ ఎరుగని తీరున మూడు లక్షలకు పైగా జనాలతో నిర్వహించడానికి వైసీపీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోందట. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అధినాయకత్వం విశాఖ పంపించింది. ఆయన దగ్గర ఉండి జనసమీకరణతో పాటు ప్రధాని సభ ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ఒక వైపు ప్రైవేట్ పరం చేస్తోంది. దాంతో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్న తీరు మీద వైసీపీ మీద సహజంగానే జనాలకు వ్యతిరేకత ఏర్పడుతోంది. దాంతో దాన్ని తగ్గించుకోవడంతో పాటు రైల్వే జోన్ తెచ్చిన క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు పరిశీలకులు.
మరో వైపు లక్షలాది మంది జనాలతో సభను నిర్వహించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ కళ్లల్లో మెరుపులు చూడాలని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. జగన్ సీఎం అయ్యాక ఏపీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ఈ స్థాయిలో ప్రారంభించలేదు. దాంతో ఫస్ట్ టైం వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలపై ఏపీ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారని తెలిసింది. ప్రధాని మోదీ రైల్వే జోన్ ఇస్తే దాన్ని తమ గొప్పగా వైసీపీ నేతలు ఎలా చెప్పుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారట. దాంతో తామే జనసమీకరణ చేసి పొలిటికల్ మైలేజ్ ని తీసుకుంటామని చెబుతున్నారు బీజేపీ రాష్ట్రనేతలు. ఈ మేరకు కేంద్ర బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఉన్నందు వల్ల వైసీపీ తమ మాట చలామణీ చేసుకుంటూ ప్రధాని సభలో తమ ఆర్భాటమే చూపించాలని పట్టుదలగా ఉందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.