Pakistan Accident: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 20 మంది సజీవదహనం
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్‌వేలో ఆయిల్ టాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
Pakistan: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ – సుక్కూర్ మోటార్‌వేలో ఆయిల్ టాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ముల్తాన్ డిప్యూటీ కమిషనర్ తాహెల్ వాటూ ప్రమాదం జరిగిన సంఘటన గురించి వివరించారు. ప్యాసింజర్ బస్సు లాహోర్ నుంచి కరాచీ వెళుతున్నపుడు జలాలాపూర్ పీర్‌వాలా ఇంటర్చేంజ్ మోటార్ వే వద్ద దుర్ఘటన జరిగిందని చెప్పారు. ముల్తాన్ కమిషనర్ అమీర్ ఖట్టాక్ కూడా తాజా ఘటన పై స్పందించారు. ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
మోటార్వే పోలీసు అధికార ప్రతినిధి సమాచారం ప్రకారం వేలాది లీటర్ల పెట్రోల్‌తో వెళుతున్న ట్యాంకర్‌ను బస్స డ్రైవర్ వెనుక నుంచి గుద్దారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నప్పడు సంఘటన జరిగి ఉండవచ్చునని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రికి తరలించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమ్జాద్ చాందియో కూడా తాజా సంఘటనపై స్పందించారు. గాయపడిన నలుగురిని వెంటనే ఆస్పత్రిలోని కాలిన గాయాలకు చికిత్స చేసే వార్డుకు తరలించామని చెప్పారు. 20 మృత దేహాలను మార్చురీకి పంపామని తెలిపారు. డీఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.