Rushi Sunak: బ్రిటీష్ వారికి భారతీయ సంతతికి చెందిన ప్రధానమంత్రి వస్తారని ఎవరు అనుకోలేదు.
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
Prime9Special: రుషి సునక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. రుషి పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అనంతరం యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రుషి తండ్రి యశ్వీర్ – కెన్యాలో జన్మించగా, తల్లి ఉష టాంజానియాలో పుట్టారు. రుషి సునక్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. మొదట కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు.
Who would have thought when India celebrates 75 years of Independence from the British, the British will get a Prime Minister of Indian origin, a first ever Hindu PM #RishiSunak #LifeComesFullCircle #India
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022
కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో రుషి సునక్లవ్లో పడ్డారు. పెద్దల అంగీకారంతో 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రుషి సునక్ తాను చదువుకునే రోజుల్లో కొంతకాలం పాటు కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్ షిప్ చేశారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి ఎంపీగా గెలిచి, 2019లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలిపారు. ఆయన ప్రధానిగా ఎన్నికయ్యాక, రుషికి ఆర్థిక శాఖలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
First Kamala Harris, now Rishi Sunak
The people of the U.S. and the U.K have embraced the non-majority citizens of their countries and elected them to high office in government
I think there is a lesson to learned by India and the parties that practise majoritarianism
— P. Chidambaram (@PChidambaram_IN) October 24, 2022
జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్‌కు పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో ‘రైజింగ్ స్టార్’ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సునాక్ పనితీరుకు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి కల్పించారు. కేబినెట్లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా చేరింది అప్పుడే. అదే ఏడాది మార్చిలో సునాక్ పార్లమెంట్లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. హిందువైన సునాక్ పార్లమెంట్లో ఎంపీగా భగవద్గీత పై ప్రమాణం చేశారు.
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను సునక్ ప్రకటించారు. వ్యాపారులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు తీసుకొచ్చారు. దీంతో పాటు పార్లమెంటులో ఆయన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అప్పట్లో ఆయన ఫొటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన ఆయన.. తర్వాత ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీనికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోయాయి. ఓవైపు పన్నుల పెంపు, మరోవైపు ధరల పెరుగుదల ప్రజల్లో అసహనానికి కారణమైంది. దీనికి రిషి నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.
అయితే.. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సమయంలో ప్రధాని బోరిస్ తన సహచరులతో కలిసి నిబంధనలు విరుద్ధంగా పార్టీ చేసుకోవడం బ్రిటన్ రాజకీయాలను తీవ్రంగా కుదిపేసింది. జాన్సన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే గాక, ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపించాయి. ఒకవేళ బోరిస్ దిగిపోవాల్సి వస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో రిషికి ఉన్న పాపులారిటీతో ఆయన పేరు పీఎం రేసులో ఎక్కువగా వినిపించింది.
వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ వైఖరిని నిరసిస్తూ, మంత్రి పదవికి రాజీనామా చేశారు 42 ఏళ్ల రిషి సునక్. ఆయన తర్వాత పలువురు మంత్రులు అదే బాట పట్టారు. దీంతో దెబ్బకు బోరిస్ జాన్సన్ దిగివచ్చారు. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రుషి సునక్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మరో ప్రధాని అభ్యర్థి లిజ్ ట్రస్ గెలిచారు. అయితే ఆమె కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో ముసలం మొదలైంది. దీంతో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత టోరీ సభ్యులు తదుపరి ప్రధానిగా రిషి సునాక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్, నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా మద్దతును పొందడం ద్వారా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునాక్ అరుదైన రికార్డు సొంతంచేసుకోవడం విశేషం.
మరోవైపు రిషి సతీమణి అక్షతా మూర్తి పై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షతా కుటుంబం సంపదపై వస్తోన్న విమర్శలపై దీటుగా స్పందించారు. భారతీయులైన తన అత్తామామలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధా మూర్తిని చూసి తానెంతో గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. తన భార్య, తాను సాధారణ పన్నుచెల్లింపుదారుడినని, తన భార్య మరో దేశానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఆమెను వేరేగా చూడాలన్నారు. గతంలో వచ్చిన విమర్శల పై ఆమె ఇదివరకే వివరణ ఇవ్వడంతో ఆ వివాదం ముగిసిందన్నారు రిషి సునక్.