Toll plaza: ఏపీ టోల్ ప్లాజా పై తమిళనాడు విద్యార్థుల దాడి
ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు కారులో తిరుమల దర్శనానికి తిరుపతికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఏపీ సరిహద్దుల్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద అక్కడి సిబ్బంది ఆపారు. ఈ క్రమంలో వారికారుకు ఉన్న ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బంది డబ్బు చెల్లించాలని, కారు పక్కకు తీస్తే మిగతా వాహనాలు వెళ్తాయని సూచించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి ఆది గొడవకు దారితీయడంతో విద్యార్థులు టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు.
ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిపైకూడా విద్యార్థులు దాడిచేశారు. కొందరిని వెంటాడి మరి దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని హెచ్చరించారు. విద్యార్థులు మొండిగా వ్యవహరించి తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు దారి ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపిస్తున్నారు..ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.