Published On:

YS Jagan: రాష్ట్ర ఆదాయం 24 శాతం తగ్గింది.. వైఎస్ జగన్ విమర్శలు

YS Jagan: రాష్ట్ర ఆదాయం 24 శాతం తగ్గింది.. వైఎస్ జగన్ విమర్శలు

Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.02 శాతం మేర పడిపోయిందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కాగ్ నివేదికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని.. కానీ ఇది అబద్ధమని కాగ్ లెక్కలు నిరూపించాయన్నారు. 2024 ఏప్రిల్ తో పోల్చితే 2025 ఏప్రిల్ లో ప్రభుత్వ ఆదాయం 24 శాతం మేర తగ్గిందన్నారు. ఏప్రిల్ లెక్కలు చెప్పకుండానే మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని విమర్శలు చేశారు.

సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీని లెక్కగడతారని, కానీ జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని పేర్కొన్నారు. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని జగన్ లెక్కలు బయటపెట్టారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం అంటూ.. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు రెవెన్యూ, జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన కాగ్ లెక్కలను పోస్ట్ చేశారు.