Published On:

Floods: తగ్గని వరదలు.. ఈశాన్య రాష్ట్రాల్లో 43కి చేరిన మృతులు

Floods: తగ్గని వరదలు.. ఈశాన్య రాష్ట్రాల్లో 43కి చేరిన మృతులు

Rains: ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15 చిన్నా, పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాదాపు 7 లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరగింది. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా వరదల ధాటికి ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అసోం, మేఘాలయ రాష్ట్రాలకు తీరని నష్టం కలిగింది. అసోంలోని 21 జిల్లాల్లో వరద ప్రభావం కనిపించగా.. 11 జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వరదలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసోంలో బాధిత ప్రజల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 31వేల 212 మంది శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

 

మరోవైపు సిక్కింలో కొండచరియలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని రెండు ఆర్మీ హెలికాప్టర్లతో రక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు చిక్కుకున్న 1700 మందిని తరలించినట్టు అధికారులు చెప్పారు. సిక్కింలోని లాచెన్ నగరంలో ఛతెన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడి ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. అలాగే తీస్తా నదిలో గత వారం కొట్టుకుపోయిన 8 మంది పర్యాటకులను ఇంకా గాలిస్తున్నారు. మేఘాలయాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇండోర్ కు చెందిన పర్యాటకుడి కోసం గాలిస్తోంది. గత పదిరోజుల్లో కుండపోత వర్షాలతో సిక్కింలో 552 కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు జరిగాయి. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 152 ఇళ్లు దెబ్బతిన్నాయి.

 

ఇక మణిపూర్ లో వరదలు పోటెత్తుతున్నాయి. వరదలకు 1.64 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 35,143 ఇళ్లు దెబ్బతిన్నాయి. కాగా వరద ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడి అస్సాంలో 17, అరుణాచల్ ప్రదేశ్ లో 11, మేఘాలయాలో ఆరుగురు, మిజోరాంలో ఐదుగురు, సిక్కింలో ముగ్గురు, త్రిపురలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రం సివాల్ జిల్లాలో భారీవర్షానికి ఏడుగురు చనిపోయారు.