Published On:

Defamation Case on Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్!

Defamation Case on Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్!

Non Bailable warrant issued on Rahul Gandhi in Defamation Case: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో జార్ఖండ్ లోని చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టు రాహుల్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే జూన్ 26న విచారణకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ రాహుల్ తరపున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

 

కాగా 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై విమర్శలు చేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ మాటలు పరువు నష్టం కలిగించేలా ఉండటమే కాకుండా బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ కోర్టుని ఆశ్రయించారు. 2018 జూలై 9 న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ పై కేసు వేశారు. తర్వాత కేసు చైబాసాలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. కాగా కోర్టు ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ విచారణకు హాజరుకాలేదు. మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తర్వాత వారెంట్ పై స్టే కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.