Published On:

Elon Musk : రాజకీయ కార్యక్రమాలకు సొమ్ములు ఖర్చు పెట్టడం నిలిపేస్తాం : ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం

Elon Musk : రాజకీయ కార్యక్రమాలకు సొమ్ములు ఖర్చు పెట్టడం నిలిపేస్తాం : ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం

Elon Musk sensational decision : ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నేతలకు కలవరం కలిగించింది. రానున్న రోజుల్లో రాజకీయ కార్యక్రమాలకు సొమ్ములు ఖర్చు పెట్టడం నిలిపివేస్తానని ఎలన్ మస్క్ బాంబు పేల్చారు. వాస్తవానికి రిపబ్లికన్ పార్టీ కార్యక్రమాలకు డాలర్లు ఖర్చు పెట్టేది మస్కే. ఈ నేపథ్యంలో ఇక పై సొమ్ములు ఖర్చు పెట్టేది లేదని మస్క్ అనడంతో రిపబ్లికన్ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.

 

ఎల‌న్ మ‌స్క్.. పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం.  ఆయన ఏం చేసినా సంచ‌ల‌న‌మే. కిందటేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా మస్క్ వ్యవహరించారు. ఆ తరువాత రిపబ్లికన్ పార్టీ విజయం సాధించడం, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవడం చకచకా జరిగిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలన్ మస్క్‌ను ట్రంప్ సర్కారు సముచితంగా గౌరవించింది. డోజ్ పేరుతో ఓ సంస్థను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ పాలనా వ్యవహరాల బాధ్యతను ఎల‌న్ మ‌స్క్‌కు అమెరికా ప్రభుత్వం అప్పగించింది.

 

అయితే తాజాగా, మస్క్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు చాలా తక్కువ ఖర్చు పెడతానన్నారు.ఖతార్ లో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ఎలన్ మస్క్ ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే రాజకీయ ప్రచారాలకు తాను పెద్ద ఎత్తున డాలర్లు ఖర్చు పెట్టినట్లు మస్క్ పేర్కొన్నారు. అయితే ఇక నుంచి ఈ ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను భావిస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. అయితే ఎలన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేతలకు మింగుడుపడలేదు.ఎందుకంటే ఇంతకాలం రిపబ్లికన్ పార్టీ ఖర్చుల్లో ఎక్కువ భాగం ఎలన్ మస్క్ భరించేవారు.అంతేకాదు కిందటేడాది ట్రంప్ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా ఎలన్ మస్కే భరించారు. దాదాపుగా 250 మిలియన్ డాలర్లు ట్రంప్ కోసం ఎలన్ మస్క్ ఖర్చు పెట్టినట్లు సమాచారం.

 

వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించడం రిపబ్లికన్ పార్టీకి చాలా ముఖ్యం.ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి మిడ్ టర్మ్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు సహజంగా ఎన్నికలంటే….ఖర్చుతో కూడుకున్న పని. వందలు, వేలాది డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో సహజంగా మస్క్ మీదనే డొనాల్డ్ ట్రంప్ ఆధారపడుతుంటారు. అధ్యక్షుడు ట్రంప్ నకు ఎలన్ మస్క్ ఆర్థిక మద్దతుదారు అనే విషయం తెలిసిందే. అంతేకాదు కీలకమైన పొలిటికల్ యాక్షన్ కమిటీకి కూడా మస్కే ప్రధాన ఆదాయ వనరు. దీంతో ఏం చేయాలో రిపబ్లికన్ పార్టీ నేతలకు పాలు పోవడం లేదు.

 

అయితే డోజ్ సారథిగా పాలనా యంత్రాంగంలో ఎలన్ మస్క్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అయితే ఈ సంస్కరణలపై అమెరికా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎక్కువ మంది మస్క్ ప్రవేశపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించారు. సంస్కరణల పేరుతో సమర్థులైన ఉద్యోగులను ఎలన్ మస్క్ ఇంటికి పంపుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో మస్క్, మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

 

ట్రంప్ విజయంతో ఎలన్ మస్క్ ఆదాయం భారీగా పెరిగింది. దీనికి కారణం ఎలన్ మస్క్‌ను ఓ స్టార్‌ అంటూ డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసించడమే. ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ షేర్ల విలువ 17శాతం పెరిగింది.అంతేకాదు ఎలన్ మస్క్ వ్యాపార సంపదను మరో 2.23 లక్షల కోట్ల కు పెంచేసింది. దీంతో ఎలన్ మస్క్ రాత్రికి రాత్రి మరోసారి ఓ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఆయనకు ఆల్రెడీ ఉన్న స్టార్‌డమ్‌ మరింతగా పెరిగింది.

ఇవి కూడా చదవండి: