Amaravati padayatra: పాదయాత్ర పై గుడివాడ పోలీసుల ఆంక్షలు
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.
Gudivada: ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు. ఏపిలో ఒక్క రాజధాని, అది కూడా అమరావతే నంటూ వెయ్యి రోజులకు పైగా చేపడుతున్న ఉద్యమంలో భాగంగా తలపెట్టిన అమరావతి రైతుల పాదయాత్ర 2పై గుడివాడ పోలీసులు ఆంక్షలు విధించారు.
వివరాల్లోకి వెళ్లితే, అమరావతి టు అరసవల్లి పేరుతో అమరావతి రాజధాని రైతులు చేపట్టిన రెండవ దఫా పాదయాత్ర 13వ రోజుకు చేరుకొనింది. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో జిల్లా పోలీసు బాస్ పాదయాత్ర పై ఆంక్షలు విధించారు. హైకోర్టు పేర్కొన్న మేర మాత్రమే 600మంది రైతులు మాత్రమే పాదయాత్రలో ఉండాలంటూ ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
మహా పాదయాత్రకు ఉద్యమకారులతో సంబంధం లేకుండా ఆయా గ్రామాల్లో వారికి స్ధానికులే నీరాజనాలు పలుకుతున్నారు. నేటి యాత్రకు సంఘీభావంగా వెల్లువలా తరలి వచ్చిన జనంతో పాదయాత్ర ప్రాంగణాలు కిక్కిరిసి పోతున్నాయి. అధికార వైకాపా మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఉద్యమానికి బ్రహ్మరధం పడుతున్నారు. జై అమరావతి, జైజై అమరావతి, ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దిక్కులు పిక్కుటిల్లేలా ప్రజలే నినదిస్తున్నారు. గుడివాడలో తెదేపా, భాజాపా, జనసేన నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతాలు పలికారు. ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ రైతులు ప్రత్యేక పూజలు చేశారు. దారి పొడువునా మహిళలు హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి, దిష్టి తీసారు.
మూడు ప్రాంతాల పేరుతో ప్రభుత్వం పేర్కొన్న మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రులు కొంతమంది ఇప్పటికే రైతులను రెచ్చగొట్టివున్నారు. మా ప్రాంతాల్లోకి ఒకే రాజధాని అని ఎలా పాదయాత్ర చేస్తారో నంటూ బహిరంగంగానే పాదయాత్ర నిర్వాహకులను హెచ్చరించివున్నారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటనలు గుప్పించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొలేదు. సరికదా తాజాగా ఆంక్షల పేరుతో గుడివాడలో పోలీసు ఆంక్షలు అంటూ పెద్ద యెత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేలా చేపట్టారు. మరోవైపు అధికార ప్రభుత్వ పెద్దలు కవ్విస్తున్నా, పాదయాత్ర సాగే ప్రాంతాల్లో వ్యతిరేక ఫ్లెక్సీలు కట్టినా ఎలాంటి త్రోటుపాటు పడకుండా కేవలం పాదయాత్ర ఉద్ధేశాన్ని మాత్రమే తెలియచేస్తున్న అమరావతి రైతులు జేఏసి చర్యలను స్ధానికులు, ప్రజలు, పలు పార్టీలు అభినందిస్తున్నాయి. వారికి తామంతా బాసట అంటూ భరోసా ఇస్తున్నాయి.