Komatireddy Venkat Reddy : గ్రామీణ రోడ్లపై టోల్ విధించే ఆలోచన లేదు : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy : గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు 40 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. 6 నెలలు లేదా 3 నెలలకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి డబుల్ రహదారులు వేయిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే రోడ్లు వేశారని చెప్పారు. మూడు నియోజకవర్గాల రోడ్లకు సింగరేణి నిధులు వినియోగించారని పేర్కొన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమన్నారు. హైదరాబాద్ నగరం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కమిషన్లకు ఆశపడి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను రూ.7,300 కోట్లకు ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల గడువుకు మూడు నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ.2వేల కోట్లు వసూలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. భూములు గురించి హరీశ్‌రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోకాపేట భూములు వేలం వేసిన చరిత్ర మీద కాదా అని మండిపడ్డారు. హరీశ్‌రావును ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని, ఆయన వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటూ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హరీశ్‌రావు.. సభలో ఇన్ని అబద్ధాలా : ఎమ్మెల్యే బాలూ నాయక్
పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు సభలో ఇన్ని అబద్ధాలు మాట్లాడుతారని అనుకోలేదని ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. పాలన అంటే ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా డబ్బులు బొక్కేయడం కాదని అని మండిపడ్డారు. పరీక్ష పేపర్ల లీకేజీతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం పాలన కాదని సెటైర్లు వేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మహిళలను సమావేశాలకు వాడుకోవడం తప్ప వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేయలేదన్నారు. ఆర్టీసీ సిబ్బంది నిరసనలు తెలిపితే ఉద్యోగాలను తొలగించారని ఫైర్ అయ్యారు. బతుకమ్మ, దసరా పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలయ్యాయని ఆరోపించారు. నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానపర్చారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. కానీ, హరీశ్‌రావు ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బాలూ నాయక్ అన్నారు.