Osmania University : ఓయూలో ధర్నాలు, నిరసనలు ఇకపై నిషేధం.. సర్క్యులర్ జారీ

Osmania University : ఉద్యమాలకు ఊపిరి పోసిన ఓయూలో ఇక నుంచి ధర్నాలు, నిరసనలు నిషేధించారు. తాజాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఓయూ శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు. కానీ, విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన, ప్రదర్శనలు, ధర్నాలు చేయడం వల్ల పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోందని సర్క్యులర్ ఇచ్చారు. యూనివర్సిటీ నిబంధనలు అతిక్రమించడం, ధర్నాలు, ఆందోళనలు, నినాదాలు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటివి చేయొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్సిటీ సిబ్బంది అధికారులపై నీచమైన భాషను ఉపయోగించడం లాంటివి నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు లేకుండా వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓయూలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్లోనే ఇచ్చిన హామీ ఏమైందో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆరోపించారు.
విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులు కాకుండా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని విమర్శించారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయమన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని కేటీఆర్ ట్వీట్ చేశారు.