Jwala Gutta: సినిమాల్లో ఉండాలంటే సిగ్గు ఉండకూడదు.. సర్దుకుపోవాలి

Jwala Gutta: బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టోర్నమెంట్స్ లో ఆమె ఆడి ఇండియాకు పతకాలను తీసుకొచ్చిపెట్టింది. ఇక బ్యాడ్మింటన్ కాకుండా జ్వాలా ఒక సినిమాలో ఐటెంసాంగ్ చేసిన విషయం తెల్సిందే. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో లచ్చమ్మ అంటూ సాగే సాంగ్ లో ఆమె మెరిసింది. ఇక ఈ సినిమా తరువాత జ్వాలా మరే సినిమాలో కూడా కనిపించలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జ్వాలా.. కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత అయిన విష్ణు విశాల్ ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.
చాలా గ్యాప్ తరువాత గుత్తా జ్వాలా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కబుర్లు గురించి చెప్పుకొచ్చింది. నితిన్ కోసమే ఆ సినిమా చేసానని, అప్పుడు ఫన్ గా అనిపించినా ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ” నితిన్ నాకు చాలా కాలంగా తెలుసు. ఒకరోజు జ్వాలా.. నువ్వు నా సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నావ్ అని అడిగాడు. నేను షాక్ అయ్యి ఏదో ఊరికే అంటున్నాడులే అనుకున్నాను. మూడు నెలల తరువాత సాంగ్ రెడీ అయ్యింది షూట్ కు రమ్మని పిలిచాడు. నేను చేయలేనని చెప్పాను. అయినా చేయమని నన్ను ఫోర్స్ చేశాడు. తన కోసమే ఈ సాంగ్ చేశాను.
నాలుగురోజులు షూటింగ్.. మొదటిరోజు పొట్టి పొట్టి బట్టలు ఇచ్చి వేసుకోమన్నారు. నాలుగురోజుల్లో అవి మరింత చిన్నవి అవుతూ వచ్చాయి. ఆ నాలుగురోజులు చాలా ఫన్ గా షూటింగ్ జరిగింది. ఇక ఈ సాంగ్ వలన నితిన్ కు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. సాంగ్ తో పాటు సినిమా కూడా హిట్ అయ్యింది. అప్పటివరకు నితిన్ ప్లాపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నా వలనే ఆ సినిమా హిట్ అయ్యింది.
నితిన్ సినిమా కన్నా ముందు నాకు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, నేనేది అంగీకరించలేదు. మన సినిమాల్లో నటించాలంటే అమ్మాయిలు తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు. కానీ, నేనేది ఓకే చెప్పలేదు. ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వారిని చూసినప్పుడల్లా నాకు ఇండస్ట్రీలో ఇలానే ఉండాలేమో అనిపిస్తుంది. వారిలా నేను ఉండలేను. ఇండస్ట్రీలో ఉండాలంటే సిగ్గు ఉండకూడదు..అన్నింటికీ సర్దుకుపోవాలి.
ఇప్పుడు నా భర్త విష్ణు విశాల్ సినిమాల్లోనే ఉన్నారు. ఆయనకు క్షణం తీరిక ఉండదు. షూటింగ్ అయ్యిపోయాకా రెస్ట్ తీసుకొనే ఛాన్స్ ఉండదు. ఆ షాట్ బాలేదా.. ? ఇది సరిగ్గా రాలేదా అంటూ పరిగెడుతూనే ఉంటారు. నా బ్యాడ్మింటన్ ఆట కేవలం 10 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత నేను రెస్ట్ తీసుకోవచ్చు. నైట్ నిద్రపోవచ్చు. ఆయనకు అలా కాదు ఎప్పుడు డబ్బుల విషయంలో టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జ్వాలా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.