Janasena Formation Day : పిఠాపురంలో జనసేన సభ.. అంతర్జాతీయ సభలకు దీటుగా ఏర్పాట్లు

Janasena Formation Day : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. జయకేతనం అనే పేరిట నిర్వహిస్తున్నది. సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్, బిల్ క్లింటన్, జార్జి బుష్ సభలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సభలకు ఏర్పాట్లు చేసిన అనుభవం ప్రశాంత్‌కు ఉంది. 12 రోజుల నుంచి 470 మంది సాంకేతిక నిపుణులతో సభావేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థతోపాటు తదితర ఏర్పాట్లు పూర్తిచేశారు. కిలోమీటరు దూరంలో ఉన్న వారికి వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుభూతి కలిగేలా ఆడియో సిస్టం సిద్ధమైంది. 23 ఎల్ఈడీ వాల్స్‌తోపాటు ఇటలీకి చెందిన లైనర్ రేస్‌తో నిర్మాణం చేపట్టారు.
సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ- పిఠాపురం – కత్తిపూడి మార్గంలో రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
జనసేనాని అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి 3.45 గంటలకు చిత్రాడలోని ప్రాంగణానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. సభ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. తొలుత తెలుగుభాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివరులో పవన్ కూటమి ప్రభుత్వ ప్రగతిపథం, పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు.