Last Updated:

Teenmar Mallanna : తెలంగాణలో బీసీల ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna : తెలంగాణలో బీసీల ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం ఎట్ల రాదో చూస్తానని పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న బీసీవాదులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర ప్రతిఒక్కరూ బానిసలుగా పడి ఉండాలని రేవంత్‌రెడ్డి కోరుకున్నారని, కానీ, మల్లన్న విషయంలో అది సాధ్యం కాదన్నారు.

బీసీల ఉద్యమం ఆగదు..
తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన తెలంగాణలో బీసీల ఉద్యమం ఆగదన్నారు. ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమను తొలగించుకోవాలని ఆయన హెచ్చరించారు. తాము వెనుకటి బీసీలం కాదని, మలిదశ బీసీ ఉద్యమకారులమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమన్నారు. బీసీలు, ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగులబెట్టినట్లు చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కులగణన సర్వే చేశామని ప్రభుత్వ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, సర్వేను తప్పుదోవ పట్టించారని మల్లన్న ఆరోపించారు.

సకల జనుల సర్వేకు విశేష స్పందన..
2014 సంవత్సరంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వేకు విశేష స్పందన వచ్చిందని చెప్పారు. దుబాయ్, మంబయి, ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు సర్వేలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా కులగణన సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కులగణనపై నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ సర్వే ముగిసిన తర్వాత సమీక్ష చేపట్టారని మండిపడ్డారు. సర్వేలో బీసీల లెక్కలు తక్కువ చూపారంటూ తాను రిపోర్టును తగులబెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రీసర్వే ఎందుకు చేపట్టిందో సమాధానం చెప్పాలన్నారు.

నాలాంటి వాళ్లు పార్టీలో ఉంటే రేవంత్‌కు నచ్చదు..
నాలాంటి వాళ్లు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌కు నచ్చదన్నారు. ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఫైర్ అయ్యారు. 6.98 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ పలుమార్లు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. నూటికి 67 శాతంగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్, 10 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పక్కా అయితే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్వేకు బాధ్యత వహించాలని డిమాండ్ చేవారు. సర్వేపై చర్చకు ముఖ్యమంత్రి రెడీ అంటే తాను ఎక్కడి రమ్మన్నా సిద్ధమేనని సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పులతడక అని నిరూపిస్తానని తేల్చి చెప్పారు. తాను పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీసీల కోసమే పోరాటం చేస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి: