Last Updated:

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. ఎప్పుడంటే..?

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. ఎప్పుడంటే..?

Delhi New CM Candidate Swearing FEB 19 or 20: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీల్లో ఢిల్లీకి కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కొంతమంది పేర్లతో అధిష్ఠానం జాబితా సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, హోం మినిస్టర్ అమిత్ షా కలిసి ప్రధాని మోదీతో చర్చించి సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినప్పటినుంచి సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీ తిరిగి భారత్ వస్తున్నారు. మోదీ వచ్చిన వెంటనే సోమవారం లేదా మంగళవారాల్లో జరగనున్న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చర్చించి అభ్యర్థిని ప్రకటించనున్నారు.

ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 48 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో నుంచి 15 మంది అభ్యర్థులను పార్టీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ 15 మందిలో నుంచి 9 మందిని సీఎం, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ శర్మ సీఎం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, పవన్ శర్మ, ఆశిష్ సూద్ వంటి పేర్లు కూడా ప్రచారంలో కొనసాగుతున్నాయి. సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడాలంటే మరో ఐదు రోజులు ఆగాల్సిందే.