TDP MLA Chintamaneni: టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో ఘర్షణ.. ఎమ్మెల్యే చింతమనేని కారును అడ్డుకునేందుకు యత్నం!
![TDP MLA Chintamaneni: టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో ఘర్షణ.. ఎమ్మెల్యే చింతమనేని కారును అడ్డుకునేందుకు యత్నం!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/tdp_29d274d05d.jpg)
TDP MLA Chintamaneni Comments on YSRCP Leaders: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా వట్లూరులో రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల్లో మధ్య గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరిగివస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చింతమనేని నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వివాహ వేడుక తర్వాత ఎమ్మెల్యే కారును వెళ్లనివ్వకుండా కొంతమంది వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అయితే తన కారును వెళ్లనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వేరు కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని, వైసీపీ నేత అబ్బయ్య చౌదరి కావాలని దగ్గర ఉండి కారును అడ్డు పెట్టించారని చెప్పుకొచ్చారు.
దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కావాలనే గొడవలకు ప్రయత్నిస్తున్నారని చింతమనేని ఆరోపించారు. అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. మన నాయకుడు గీసిన గీత దాటకుండా అందరూ వ్యవహరించాలని చింతమనేని ప్రభాకర్ కోరారు.