Last Updated:

Deputy CM Pawan Kalyan: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పవన్ కల్యాణ్ సీరియస్!

Deputy CM Pawan Kalyan: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పవన్ కల్యాణ్ సీరియస్!

Chilkur Balaji Temple Head Priest Rangarajan Attacked by Some People: తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ఖండించారు. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. ఈ దాడి వ్యక్తిపై చేసినట్లు కాదని, ధర్మరక్షణపై చోటుచేసుకున్న దాడిగా పరిగణించాలన్నారు.

చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపించడంతో పాటు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు.

కొంతమంది రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక.. రంగరాజన్‌పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని కోరారు. ఆ మూకను నడిపిస్తుంది ఎవరనే విషయాన్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు.

సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ పలుమార్లు అందించారని గుర్తు చేసుకున్నారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారన్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు.