Actor Venu: సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు!
Case on Actor Venu Thottempudi: సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ఓ ప్రాజెక్ట్ విషయమైన చేసుకున్న ఒప్పందాన్ని మధ్యలోనే బ్రేక్ చేసి తమకు నస్టాన్ని కలిగించారంటూ బీజేపీ ఎంపీ రమేష్ కుటుంబానికి చెందిన వారు వేణుపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడం వేణు వ్యాపారంగంలోకి అడుగుపెట్టాడు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధిగా ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీతో కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కానీ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుండి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తప్పుకుంది. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో పాటు.. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో మధ్యలోనే కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవడంపై రిత్విక్ సంస్థ అభ్యంతరం తెలిపింది.
దీని వల్ల తమ కంపెనీకి భారీ నష్టం వచ్చిందని ఆరోపిస్తూ నటుడు వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులపై బుధవారం హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ బీజేపీ ఎంపీ రమేష్ కుటుంబానికి చెందినదని, ఈ కంపెనీని ఆయన సోదరుడు నిర్వహిస్తూ ఉంటారని సమాచారం.
కాగా ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన వేణు సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత రవితేజ ‘రమారావు ఆన్‌డ్యూటీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో పోలీసు ఆఫీసర్ ఆయన పోషించిన పాత్ర మంచి ఆదరణ పోందింది. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయనకు మళ్లీ అవకాశాలు కరువైయ్యాయి. దీంతో వేణు నటనకు బ్రేక్ చెప్పి వ్యాపారంలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసు కేసు నమోదైనట్టు వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.