Last Updated:

MLC Elections: ఎమ్మెల్సీల నామినేషన్లు షురూ.. బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం

MLC Elections: ఎమ్మెల్సీల నామినేషన్లు షురూ.. బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం

Notification Released for MLC Elections in Telangana: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత అంతిమంగా బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

బీజేపీ అభ్యర్థుల ప్రకటన
రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు బిజెపి మూడు ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి అభ్యర్థిగా నరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ కరీంనగర్ మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్‌సి అభ్యర్థిగా.. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని ప్రకటించింది.

టీచర్ల సంఘాల అభ్యర్థులు వీరే..
అలాగే ఉపాధ్యాయ సంఘాలు సైతం ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఆయా నియోజకవర్గాలలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. వరంగల్ -ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి పింగిళి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్ రెడ్డిని పిఆర్‌టియుటిఎస్ తరపున తమ అధికారిక అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే జాక్టో తరపున వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్ ఖరారు చేశారు. టిఎస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్ సంఘాలు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డిని, మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్‌ను ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు ఆయా ఉపాధ్యాయ ఎంఎల్‌సి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయించగా, అభ్యర్థులతో కలిసి నేతలు ఆయా జిల్లాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్ వ్యూహమేంటి?
మూడు ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి గులాబీ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కెసిఆర్ ఎంఎల్‌సి ఎన్నికలను ఉపయోగించుకున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పలు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని కేటీఆర్ అప్పట్లో భావించినట్లు తెలుస్తోంది. అయితే మారిన పరిస్థితిలో.. గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలో పోటీ చేయాలని పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. బీసీ కార్డుతో ముందుకు వెళితే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఆశావహులు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఇక.. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి, భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని, ఆయనకు కేటీఆర్‌, హరీశ్‌రావు ఓకే చెప్పారనే వార్తలు వస్తున్నాయి.
ఇదీ షెడ్యూల్…
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల సందడి మొదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలను దాఖలు చేయవచ్చు. కాగా, ఈ నెల 11న నామినేష్ల పరిశీలన ఉండగా.. 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసేకుందుకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్‌ జరుగుతుంది. వచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లో స్వీకరిస్తారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా.. 191 మండలాల్లో 200 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు.