Election Commission: మారని రాహుల్ తీరు… ఎలక్షన్ కమిషన్ కు షరతులు.!

Election Commission: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏకపక్ష నిర్ణయాలు రావడానికి ఎన్నికల ప్రక్రియ అంతా గందరగోళంగా జరిగిందని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కొంతకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులతో పాటు శశిథరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు.
మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత 76 లక్షల ఓట్లు వేశారన్న ఆరోపణపై దాఖలైన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు కొట్టివేయడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ ప్రక్రియ అంతా “కోర్టు సమయాన్ని వృథా చేయడం”గా అసహనం వ్యక్తం చేసింది. తమ విలువైన ఒక రోజు పూర్తిగా వృథా అయింది అంటూ.. కోర్టు ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో జరిమానా విధించకుండా సంయమనం పాటించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఈ క్రమంలో రాహుల్ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ ముందుకు రావడం విశేషం. అయితే ఈసీ ఇచ్చిన ఆఫర్ ను రాహుల్ స్వాగతించినప్పటికీ చాలా కీలకమైన షరతులు విధించారు. ఈసీతో తమ పార్టీ ప్రతినిధుల బృందం చర్చకు వస్తుందని.. కానీ ఎన్నికల రోజు వీడియో ఫుటేజ్‌తో పాటు మహారాష్ట్ర ఓటరు జాబితాకు సంబంధించిన డిజిటల్, మెషిన్-రీడబుల్ కాపీని వారం రోజుల్లో అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తీర్చిన తర్వాతే ఈసీతో సమావేశమవుతామని చెప్పడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈసీ రాహుల్ విధించిన షరతులకు అంగీకరిస్తుందా.. కాంగ్రెస్ నేతల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.