Enforcement Directorate: టీఆర్ఎస్ చుట్టూ ఈడీ ఉచ్చు ?
ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్‌గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది
Hyderabad: ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్‌గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈడీ గుప్పిట టీఆర్ఎస్ చిక్కినట్లే అని భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు చేస్తున్న దర్యాప్తు, వారు ఇస్తున్న లీకులు టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో అతి సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు సోదా చేసిన ఈడీ టీమ్‌లు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి.
ఒక టీమ్‌లో ఉన్న సిబ్బందిని మరోసారి ఇంకో టీమ్‌లోకి మారుస్తూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచడంతో పాటు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ కంపెనీలపై ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇప్పుడు లిక్కర్ స్కాం వ్యవహారంలో ఐటీ సహకారాన్ని ఈడీ కోరింది. వ్యాపారవ్తేత, టీఆర్ఎస్ అగ్రనేతలకు సన్నిహితుడిగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని తెలుస్తోంది. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నారని గట్టి ఆధారాలు లభించినట్లుగా సమాచారం. ఆయన కంపెనీల ద్వారా రూ. 200 వందల కోట్ల రూపాయలు ఆప్ కు చేరాయని చెబుతున్నారు.
మరోవైపు, ఈడీ దాడులపై టీఆర్ఎస్ గుంభనంగా వ్యవహరిస్తోంది. కవితకు నోటీసులు వచ్చాయన్న ప్రచారం పై ఆమె మాత్రమే స్పందించారు. ఇతరులెవరూ స్పందించడం లేదు. ఈ అంశం పై మాట్లాడవద్దని టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ప్రచార మాథ్యమాల్లోకానీ, సోషల్ మీడియాలో కానీ పెద్దగా హడావుడి జరగకుండా ఒక కీలక అధికారి ఒకరు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ ఫర్ కాగా, మరో అధికారి వచ్చేస్తున్న వైనం చూసినప్పుడు, తుపాను ముందు ప్రశాంత వాతావరణం లాంటిదని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెక్ పెట్టేందుకు వీలుగా, ఒక కీలక స్థానంలో ఉన్న మహిళా అధికారిణిని బదిలీ చేసినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను తాజాగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో ప్రస్తుతం ముంబయిలో ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్‌ని ఐటీ దర్యాప్తు విభాగం డీజీగా బదిలీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే, సీఎం కేసీఆర్ కుటుంబానికి కొత్త కష్టాలు ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఎందుకంటే, ఐఆర్ఎస్ వసుంధరా సిన్హా మరెవరో కాదు. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న అంజనీ కుమార్ సతీమణి ఆమె. అవినీతిని వెలికి తీసే రెండు కీలక శాఖలకు భార్యభర్తలే ఉండటం. ఇద్దరూ తెలంగాణలో కీలక స్థానాల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా ఆమెను తప్పించి, మరొకరిని తీసుకురావటంతో కొత్త సమీకరణాలకు తెర తీసినట్లవుతుందని చెబుతున్నారు. అయితే, కేసీఆర్ కుమార్తె కవితను బీజేపీ టార్గెట్ చేసినట్లుగా మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సున్నితమైన విషయం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇది ఆషామాషీ కాదని, సంచలనాలు ఉంటాయని రాజకీయ పరిశీలకలు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద, సంచలన పరిణామాలకు సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ చాలా వేగంగా సాగుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనలో నిజమెంతో కాలమే సరైన సమాధానం చెప్పగలదు.