Private Ambulance mafia: గూడూరులో రెచ్చిపోయిన ప్రైవేటు అంబులెన్స్ మాఫియా
మనిషి మృతదేహంపై కాసులు ఏరుకొనేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి మరీ రెచ్చిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపించాల్సిన ఆ సమయంలో రాబంధుల్లా పీల్చుకు తింటున్నారు
Gudur: మనిషి మృతదేహం పై కాసులు ఏరుకొనేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి మరీ రెచ్చిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపించాల్సిన ఆ సమయంలో రాబంధుల్లా పీల్చుకు తింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతతో ఓ యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకెళ్లకుండా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకొన్న అమానవీయ సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకొనింది.
సమాచారం మేరకు, కోట మండలం తిమ్మనాయుడు కు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పోస్టుమార్టం అనంతరం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువుల స్థానిక అంబులెన్స్ డ్రైవర్ ను కలిసారు. 17కి.మీ ప్రయాణానికి 4వేలు అడగడంతో తాము అంత ఇచ్చుకోలేమని మృతుడి బంధవులు అంబులెన్స్ డ్రైవర్ ను వేడుకొన్నారు. కనికరించకపోవడంతో బయట నుండి మరో అంబులెన్సును తెచ్చుకొనే ప్రయత్నం చేశారు. గమనించిన స్ధానిక అంబులెన్స్ డ్రైవర్లంతా ఏకమై అడిగినంత డబ్బు ఇచ్చి తీసుకెళ్లాలంటూ వారితో వాగ్వివాదానికి దిగారు. బయట నుండి వచ్చిన వాహనాన్ని సైతం అడ్డుకొని వారిపై జులుం ప్రదర్శించారు. వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు శతవిధాల ప్రయత్నం చేశారు. చివరకు ఇరువైపులా శాంత పరిచి పరిస్ధితిని సద్ధుమణిగించారు. దోపిడీ చేయాలనుకొన్న అంబులెన్స్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
గత కొంతకాలంగా గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల దోపిడికి అంతులేకుండా పోయింది. పలు సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నప్పటికి ప్రయోజనం శూన్యంగా మారింది. దీంతో ప్రైవేటు వ్యక్తుల దోపిడి మరింత ఎక్కువైంది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శవాన్ని అక్కడనుండి తరలించేందుకు వారు ఒప్పుకోరు. సరి కదా ఎవరైనా మరో వాహనాన్ని తీసుకెస్తే నానా రభస చేసి వారి పంతమే గెలిపించుకొంటారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి మాఫియాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా కట్టడిలో ప్రభుత్వం విఫలం చెందడాన్ని స్ధానికులు తప్పుబడుతున్నారు.