BJP-JDU: బీజేపీకి జేడీయూ ఎమ్మెల్యే గుడ్‌బై.. నితీష్ యూటర్న్!
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది..
మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామంటూ జేడీయూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. భాజపాకు తమ మద్దతు ఉండదని వెల్లడించారు. తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు. అయితే, ఈ ప్రకటనను జేడీయూ కేంద్ర అధినాయకత్వం తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ వెల్లడించారు. అది క్షేత్రమయుం బీరెన్ సింగ్ తన సొంతంగా చేసిన ప్రకటన అని, ఆయన జాతీయ నాయకత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. దీనిని క్రమశిక్షణారాహిత్య చర్యగా భావించి, ఆయన్ను పదవి నుంచి తప్పించినట్లు వెల్లడించారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మిగిలింది ఒక్కరే..
మణిపుర్లో 2022లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా, ఒకరే మిగిలిపోయారు. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది సభ్యులున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ముగ్గురి మద్దతు ఉంది. దీంతో ఇప్పుడు ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు. కానీ కేంద్రం, బిహార్‌లో ఎన్డీయే కూటమిలో కీలక పక్షమైన నీతీశ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, కాసేపటికే అధినాయకత్వం నిర్ణయం కాదంటూ వివరణ ఇవ్వడం గందరగోళానికి గురిచేసింది.