Sarla Shunya Air Taxi: వస్తున్నాయ్.. ఎయిర్ ట్యాక్సీలు.. ప్రయాణమంతా గాల్లోనే..!
Sarla Shunya Air Taxi: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అనేక రకాల వాహనాలు, కార్లు కనిపించాయి. చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్ మోడల్లను కూడా అందించాయి. ఆటో ఎక్స్పో 2025లో సరళా ఏవియేషన్ జీరో పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ టాక్సీని ప్రవేశపెట్టింది. ఇది సిటీ ట్రాఫిక్‌కు కొత్త, స్థిరమైన దిశను అందించబోతోంది. ఎయిర్ టాక్సీలో ఏయే ప్రత్యేక ఫీచర్లు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
ఎయిర్ టాక్సీ ఫీచర్లను తెలుసుకునే ముందు, అది ఏమిటో తెలుసుకుందాం. సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన అడ్రియన్ ష్మిత్తో మాట్లాడుతూ.. నగర ప్రాంతాలలో వేగంగా ప్రయాణించేలా దీనిని రూపొందించామని అన్నారు. ఇది eVTOL సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది, అంటే ఇది నిలువుగా టేకాఫ్‌తో పాటు ల్యాండింగ్ చేయగలదు. 2028 నాటికి బెంగళూరు నుంచి దీన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడి తర్వాత ముంబై, ఢిల్లీ, పుణె వంటి పెద్ద నగరాల్లో కూడా ప్రారంభించనున్నారు.
‘జీరో’ 250 కి.మీ/గం వేగంతో ప్రయాణించగలదు. ఇది 6 మంది ప్రయాణీకులను, 1 పైలట్‌ను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 680 కిలోల వరకు బరువును ఎత్తగలదు. ఇది 20-30 కి.మీ తక్కువ దూరాలకు అనుకూలంగా ఉంటుంది, ప్రయాణికులు రద్దీగా ఉండే ప్రాంతాలకు త్వరగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రారంభంలో ప్రీమియం టాక్సీ సర్వీస్‌ల మాదిరిగానే ధరలు ఉంటాయి, అయితే భవిష్యత్తులో దీనిని ఆటో-రిక్షా ఛార్జీల వలె చౌకగా చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి.
సరళ ఏవియేషన్ కో-ఫౌండర్, సీఈఓ అడ్రియన్ ష్మిత్ మాట్లాడుతూ ‘జీరో’ కేవలం సాంకేతిక విజయమే కాదు, భారతదేశంలో పట్టణ రవాణా పని తీరును పూర్తిగా మార్చే ప్రయత్నమని అన్నారు. ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఇది భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
సరళ ఏవియేషన్ ఇటీవల యాక్సెల్ నేతృత్వంలోని $10 మిలియన్ల సిరీస్ A1 నిధులను అందుకుంది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. అధునాతన సాంకేతిక అభివృద్ధి, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు ఈ నిధులు సహాయపడతాయి.
సరళ ఏవియేషన్ భవిష్యత్తులో ఉచిత ఎయిర్ అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది, ఇది పట్టణ ప్రాంతాల్లో త్వరిత వైద్య సేవలను అందిస్తుంది. ఆరోగ్య సంక్షోభాలకు త్వరగా స్పందించేలా చేస్తుంది. దీనితో పాటు సైన్యానికి కూడా ఉపయోగించవచ్చు.