Last Updated:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అనే నేను.. 47వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అనే నేను.. 47వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

Donald Trump Presidential Inauguration: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్‌ ప్రమాణం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్‌తో కూడా అమెరికా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్‌లో రాత్రి పదిన్నర గంటలకు జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గతంలో 2017లో తొలిసారి అమెరికా పగ్గాలు చేపట్టిన ట్రంప్ నేడు రెండవ సారి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.

సందడిగా ‘ఇనాగ్యురేషన్’
అమెరికాలో ఒక అధ్యక్షుని పరిపాలన కాలం ముగిసి, తరువాత గెలుపొందిన వారి పాలన ప్రారంభమయ్యే సమయంలో జరిగే అధికారిక వేడుకనే ‘ఇనాగ్యురేషన్’ అంటారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ నూతన అధ్యక్షునిగా ప్రమాణం చేశారు. ‘అమెరికా అధ్యక్ష పదవిని నేను విశ్వసనీయంగా నిర్వహిస్తానని, నా శక్తి మేరకు అమెరికా రాజ్యాంగాన్ని పరిరక్షించి, కాపాడతానని సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.’ అని అధ్యక్షునిగా ఎన్నికైన వారు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం సందర్భంగా ట్రంప్ రెండు బైబిళ్లను పట్టుకుని ప్రమాణం చేశారు. వాటిలో ఒకటి 1955లో తన తల్లి ఆయనకు ఇచ్చిన వ్యక్తిగత బైబిల్ కాగా, రెండోది 1861లో అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఇనాగ్యురేషన్ రోజు వాడినది.

ఈసారి వేదిక మార్పు..
సోమవారం వాతావరణం అత్యంత శీతలంగా ఉండటంతో ఈ వేదికను క్యాపిటల్ రోటుండా లోపల ఏర్పాటు చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే.. 1985లో నాటి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రోనాల్డ్ రీగన్ సైతం క్యాపిటల్ స్టెప్స్‌ మీద కాకుండా క్యాపిటల్ రోటుండా వేదికగా ప్రమాణ స్వీకారం చేయగా, 40 ఏళ్ల అనంతరం మరోసారి డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ రోటుండాలో నిర్వహించారు.

ఒకరోజు ముందుగా..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు ట్రంప్ సోమవారం వాషింగ్టన్ చేరుకున్నారు. అంతకుముందు సంప్రదాయాలను అనుసరించి, జనవరి 19 రాత్రి పెన్సిల్వేనియాలోని అధికారిక అతిథి నివాసమైన బ్లెయిర్ హౌస్‌లో గడిపారు. అంతకుముందు ఆయన ఎయిర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికలో మాజీ సైనికుల సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, అనంతరం క్యాపిటల్ వన్ ప్రాంతంలో జరిగే ర్యాలీలో కూడా ప్రసంగించారు.

తరలి వచ్చిన అతిథి గణం
ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హాజరయ్యారు. అలాగే, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లా, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీపార్టీకి చెందిన టినో శ్రుపాల, బ్రిటన్ పాపులిస్ట్ పార్టీ నాయకుడు నిగెల్ ఫరాజ్ పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ దంపతులు కూడా ప్రముఖులు ఉన్నారు. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి పలు రంగాల ప్రముఖులు హాజరు కాగా, భారత్ తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.

ట్రంప్‌కి ‘ఇండియాస్పోరా’ శుభాకాంక్షలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు, ప్రపంచ భారతీయ సమాజానికి చెందిన లాభాపేక్షలేని సంస్థ ఇండియాస్పోరా సోమవారం డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించింది. కొత్త పరిపాలనలో అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాస్పోరా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ రంగస్వామి మాట్లాడుతూ, ‘ఇండియాస్పోరా, ఇండియన్-అమెరికన్ సమాజం తరపున, అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో కొత్త రాజకీయ వాతావరణం అమెరికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇక.. అమెరికాకు స్వర్ణయుగం

అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టటమే లక్ష్యంగా తన పాలన సాగుతుందని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి ప్రసంగంలో స్పష్టం చేశారు. ‘అమెరికా ఫస్ట్’అనే నినాదంతో ముందుకు పోతామని ప్రకటించారు. ఉగ్రవాదం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, దేశంలోని పౌరుల శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తలదాచుకుంటున్న అక్రమ వలసదారులంతా పెట్టేబేడా సర్దుకుని తమ స్వదేశాలకు తరలిపోవాలని ఆదేశించారు. అమెరికా ఎన్నో సవాళ్లును ఎదుర్కొని ఈ స్థానానికి వచ్చిందని, దీనికి మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. దేశంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తానని, వాతావరణ పరిస్థితులతో ఇక్కట్ల పాలయ్యే వారికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల నుంచి తాను సురక్షితంగా బయటపడటానికి దేవుడి దయే కారణమని, అమెరికాకు సేవచేయాల్సి ఉన్నందునే ఆ భగవంతుడు కాపాడాడని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాను సైనిక పరంగా నంబర్ ఒన్ స్థానంలో నిలబెడతానని కూడా ట్రంప్ ప్రకటించారు. సామాన్యులను వేధిస్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయటమే గాక ధరలు తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చివరగా.. అత్యంత గౌరవంగా, అత్యంత సురక్షితంగా, అత్యంత సౌకర్యంగా జీవించే అవకాశమున్న దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతానని ట్రంప్ తన తొలి ప్రసంగంలో ప్రజలకు వాగ్దానం చేశారు. పనామా కాలువను చైనాకు దక్కనీయబోయమని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చుతామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: