Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులను భారత్ రప్పించేందుకు అమెరికాతో కీలక ఒప్పందం
Hyderabad Police Plan to Arrest Former OSD Prabhakar rao and Shravan in Phone Tapping Case: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నిందితులైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్‌రావులను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేరస్తుల అప్పగింత అస్త్రంను పోలీసులు ప్రయోగించనున్నారు.
అమెరికాలో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం చేసుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కేంద్రానికి సీఐడీ నివేదిక పంపింది. అయితే కేంద్ర హోం శాఖ పంపిన ఈ నివేదికను అమెరికాకు విదేశీ వ్యవహారాల శాఖ పంపనుంది. అలాగే రెడ్ కార్నర్ నోటీస్‌కు సైతం హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
అయితే, అమెరికాలో ఉంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను హైదరాబాద్ రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే భావనతో ఉన్నారు. ఒకవేళ ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే.. కరడుకట్టిన నిందితులను తప్పనిసరిగా భారత్‌కు అప్పగించవచ్చు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావులను సైతం భారత్‌కు పంపించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీని కేంద్రంగా చేసుకొని ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పిడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో భాగంగానే డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాలకు వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లగా.. శ్రవణ్ రావు లండన్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన కూడా అమెరికా చేరుకున్నారు.
అయితే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చామని, జూన్‌లో తిరిగివస్తామని వెల్లడించారు. కానీ ఇప్పటివరకు వారిద్దరూ తిరిగి రాలేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరినీ హైదరాబాద్ తీసుకొచ్చేందుకు గతంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీకి కసరత్తు చేయగా.. తాజాగా, ఎక్స్‌ట్రడిషన్ ప్రక్రియను ప్రారంభించడంతో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు చర్చనీయాంశంగా మారింది.