Israel-Hamas Ceasefire: మాట తప్పితే మళ్లీ యుద్ధమే.. హమాస్‌కు నెతన్యాహూ వార్నింగ్
Netanyahu’s Big Warning To Hamas Hours Before Truce Begins Israel-Hamas Ceasefire: తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము మరోసారి యుద్ధ క్షేత్రంలో దిగాల్సి ఉంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ హమాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ఖాతా నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీంతో ఈ శాంతి ఒప్పందం అమలు మీద అంతర్జాతీయంగా అనుమానాలు ముసురుకుంటున్నాయి.
15 నెలల తర్వాత..
2023 అక్టోబర్ 7న వందలాది హమాస్ తీవ్రవాదులు.. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి భీకరంగా కాల్పులు జరిపిన ఘటనలో 1200 మంది కన్నుమూయగా, 251మందిని బందీలుగా చేసి గాజాకు తీసుకుపోయారు. దీంతో ప్రతీకారంతో పాలస్తీనా మీద విరుచుకుపడిన ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా ఇన్నాళ్లుగా దాడులు చేస్తూ వచ్చింది. ఈ హింసలో 46,700 మందికి పైగా గాజా పౌరులు చనిపోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా, ఈ హింసకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చి ఇరు పక్షాలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమై, ఇజ్రాయెల్-హమాస్ శుక్రవారం ఒక ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే.
అమల్లోకి శాంతి ఒప్పందం
కాగా, తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విరమణ మొదలు కావాల్సి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఒట్జామా యెహుదిత్ పార్టీ నేత, జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ తప్పుకున్నారు. దీంతో నెతన్యాహుపై రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ ప్రకటన..
‘ఖైదీల అప్పగింత విషయంలో హమాస్ ఒప్పందాన్ని గౌరవించాలి. ఒప్పందం ప్రకారం హమాస్ 33 మంది బందీల పేర్లతో జాబితాను విడుదల చేసేవరకు ముందుకెళ్లలేము. ఒకవేళ అది ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ సహించదు. తర్వాతి పరిణామాలకు కేవలం హమాస్ మాత్రమే బాధ్యత వహించాలి’ అని ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీనికి కొనసాగింపుగా, అదే పరిస్థితి గనుక వస్తే, అమెరికా మద్దతుతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని నెతన్యాహు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.