Nara Lokesh: ఎన్టీఆర్‌కు భారతరత్న.. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణమని లోకేశ్ వెల్లడి
Nara Lokesh paid tributes at NTR Ghat on the occasion of his death: ఎన్టీఆర్‌కు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్డీఆర్ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరితో కలిసి నారా లోకేశ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేశారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించారన్నారు. టీడీపీని స్థాపించన ఏడాదే అధికారంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ హయాంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. టీడీపీలో కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని చెప్పారు.
విశ్వ విఖ్యాత, సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామరావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాల పేరు కాదని, ఓ ప్రభంజనం అని నారా లోకేశ్ వెల్లడించారు. అటు సినిమా రంగాల్లోనూ, ఇటు రాజకీయ రంగాల్లోనూ నంబర్ వన్‌గా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిలో రూ.2కే బియ్యం, పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా హక్కు వంటి సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కారణంగా తెలుగు వాళ్లు ప్రపంచమంతా తల ఎత్తుకొని తిరుగుతున్నారన్నారు.
ఎన్టీఆర్ ఏ ఆశయాలతో టీడీపీని స్థాపించారో.. ఆయన స్ఫూర్తితో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని లోకేశ్ వెల్లడించారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నామని చెప్పారు. ఇక, తెలంగాణలో పార్టీ పునర్మిర్మాణంపై చర్చిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగానలో 1.60లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందన్నారు.