Future Of Mobility Belongs to India: భారత్ పెట్టుబడులకు స్వర్గధామం..భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ప్రారంభం
PM Modi says Future of mobility belongs to India at Bharat Mobility Global Expo 2025: దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి భారతదేశం అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు.
ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర..
ప్రధాని మోదీ ‘భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025’ను ప్రారంభించారు. గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై దేశం దృష్టిసారిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ దశాబ్దం చివరికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయన్నారు.
5 ఏళ్ల క్రితం ఫ్రేమ్-2 పథకం..
5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్రేమ్-2 పథకం కింద రూ.8000 కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు దేశంలో నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోయేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతుండటంతో కార్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఏడాదికి దాదాపు 2.5 కోట్ల కార్లు విక్రయమవుతున్నాయని తెలిపారు.
ఆటోరంగాన్ని ముందుకు..
పెరుగుతున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలు దేశంలో ఆటోరంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయన్నారు. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. వీరు వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారని మోదీ చెప్పారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు.
ఈ నెల 22 వరకు ఎక్స్ పో..
దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారత్ మొబిలిటీ ఎక్స్ పో ఈ నెల 22వ వరకు జరగనుంది. యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్ వేదికల్లో ఎక్స్పో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 5,100 మందికి పైగా అంతర్జాతీయ ఆవిష్కర్తలు, 5లక్షలకు పైగా సందర్శకులు, ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. ఆటోమోటివ్, మొబిలిటీ రంగాల్లో సహకారం, సృజనాత్మకతను పెంపొందించడం కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.