Last Updated:

IND w Vs IRE womens: ఐర్లాండ్‌‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్

IND w Vs IRE womens: ఐర్లాండ్‌‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్

IND w Vs IRE womens match Mandhana and Rawal centurys India to record win: ఐర్లాండ్‌, భారత్ మహిళల మధ్య జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలొ భారత్ 304 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.

ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో చెలరేగారు. అయితే స్మృతి మంధాన కేవలం 70 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మొత్తం స్మృతి మంధాన 80 బంతుల్లో 135 పరుగులు చేసింది. అలాగే ప్రతీకా రావల్ 129 బంతుల్లో 154 పరుగులు చేసింది. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు 233 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వికెట్ కీపర్ రిచా ఘోష్ 42 బంతుల్లో 59 పరుగులు, హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 15, జెమీమా రోడ్రిగ్స్ 4, దీప్తి శర్మ 11 పరుగులు చేశారు. దీంతో భారత్ 435 పరుగుల భారీ స్కోరు సాధించింది.

436 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ జట్టు తడబడింది. 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బ్యాటర్లలో లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్ జెల్(5), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఇక, భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో పడగొట్టగా.. తనూజ కన్వార్ 2 వికెట్లు, టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి తలో వికెట్ తీశారు.

ఇక, మూడు వన్డేల్లో విజయం సాధించిన భారత్.. 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక, సెంచరీతో రాణించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా, టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.