Allu Arjun National Award: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?
Teenmaar Mallanna Emotional comments Allu Arjun National Award: పుష్ప- 2 హీరో అల్లు అర్జున్‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమా ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరమని, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవద్దన్నారు. ఈ సినిమాను చూస్తే.. సమాజానికి చెడు సందేశం వెళ్తుందన్నారు.
అయితే, పుష్ప సినిమాలు కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసులు మనోభావాలను పైతం దెబ్బతీసిందని మల్లన్న అన్నారు. ఇలాంటి సినిమాకు అల్లు అర్జున్‌కు ఇచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలన్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన డైరెక్టర్ సుకుమార్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని అన్నారు.
కాగా, అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన మాటలపై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. రేవతి చనిపోయిన విషయం తెలిసినప్పటికీ 24 గంటలు తర్వాత విషయం తెలిసిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తొక్కిసలాట డిసెంబర్ 4న రాత్రి 9.45 నిమిషాలకు జరగగా.. డిసెంబర్ 5న సాయంత్రం 4 గంటలకు కేసు నమోదైంది. 15 నుంచి 16గంటల సమయంలో చనిపోయిన రేవతి విషయంపై ఎలాంటి స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, సీపీఐ నారాయణ పుష్ప-2 సినిమాపై మండిపడ్డారు. స్మగ్లర్ వ్యవస్థతో పాటు ఎర్రచందన స్మగ్లింగ్ లాంటి వ్యాపారాన్ని గౌరవంగా చూపించడం సరికాదన్నారు. అలాగే హంసాత్మక నేరాన్ని తగ్గొద్దని డైలాగ్స్‌తో ప్రోత్సహించడం మంచిది కాదని వివరించారు. ఇలాంటి సినిమాలకు రాయితీలు ప్రకటించి ప్రజలపై భారం వేయకూడదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.