Last Updated:

India vs Australia: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌కు వరుణుడు ఆటంకం

India vs Australia: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌కు వరుణుడు ఆటంకం

India vs Australia 3rd Test Day 3: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(1)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(3), పంత్(9) కూడా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(33), రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నారు.

అయితే, విరాట్ కోహ్లి ఔట్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. మరోసారి విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనబరిచాడు. హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్‌ బాల్‌ను షార్ట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా విరాట్ కోహ్లి ఔట్ కావడం ఈ సిరీస్‌లో మూడోసారి కావడం విశేషం. ఈ ఔట్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ బంతి ఆడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, భారత్ బ్యాటింగ్‌కు బరిలో దిగగా.. సుమారు వరుణుడు ఆరుసార్లు ఆటంకం కలిగించాడు. భారత బ్యాటర్లతో పాటు ఆసీస్ బౌలర్లను సైతం వరుణుడు ఇబ్బంది పెట్టాడు. దీంతో 33 ఓవర్లకు మూడో రోజు ఆట ముగిసింది. ఇందులో భారత్ తొలి ఇన్నింగ్స్ 17ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. భారత్ 51 పరుగులు చేయగా.. ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.