Heavy Rains: మరో మూడు భారీ వర్షాలు.. రాకపోకలు బంద్
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి.
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇటీవల వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. కావున భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూయిస్తున్నారు. ఈ వర్షాలుకు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను ప్రస్తుతం మూసివేసినట్లు అధికారులు చెప్పారు. ఆ జలశయాలు నిండుకుండలా మారాయని, ఔట్ ప్లో అవుతోందని తెలియజేశారు.
అలాగే, భారీ వర్షాలకు శ్రీకాళహస్తిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రేణిగుంట మండలంలోని ఆర్తురు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాములకాల్వ రోడ్డుమీదకు ప్రవహిస్తుంది. దీంతో భక్తులు గుడివద్దకు రావొద్దని ఈఓ సూచించారు. అటు సున్పుకాల్వ సైతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. వరి, బొప్పాయి, నిమ్మ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.