KTR: ప్రజాపాలన అంటూ గొప్పలు.. హామీల గురించి అడిగితే దాడులా..?
Ex Minister KTR Sentational Comments about Congress Government: తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ప్రజలను పీడిస్తూ వారి ఉసురు పోసుకుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం మండిపడ్డారు. ఏడాది రేవంత్ పాలనలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు.. ఇలా ప్రతి వర్గమూ నిరాశకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల గురించి నిలదీసే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
హామీల అమలెక్కడ?
ఏడాది కాలంలో పేదల భూమలను కాంగ్రెస్ సర్కారు చెరబట్టిందని, హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టారని ఆయన మండిపడ్డారు. రైతు బంధును ఎత్తేశారని, రైతు బీమాకు పాతరేశారని, కేసీఆర్ ఇచ్చిన కిట్లు ఎటు పోయాయో తెలియదని ఎద్దేవా చేశారు. అమ్మఒడిని ఆగం చేశారని, నిరుద్యోగుల ఉసురు పోసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతామన్నారు. హామీలపై నిలదీసిన ఆశావర్కర్లను అవమానించారన్నారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మనే మార్చారు..
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి పోరాడారని, నాడు వారంతా ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తే, నేటి సీఎం రేవంత్ రెడ్డి, నాడు సమైక్యవాదుల పంచనచేరి వంచన చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే అహంకారంతో ఏకంగా తెలంగాణ తల్లినే మార్చారని దుయ్యబట్టారు. చరిత్రను చెరిపేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ముగింపు కాలం రాగానే కాటేసి తీరుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
ఆశావర్కర్కు పరామర్శ
హైదరాబాద్- కోఠి డీఎంఈ ఆఫీస్ ఎదుట సోమవారం గాయపడిన ఆశావర్కర్లను కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి వెళ్లి ఆమెను పరామర్శించి ఆశాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కాగా, కేటీఆర్‌తో బాటు తామూ లోపలకు పోయేందుకు అనుమతించాలని నేతలు, కార్యకర్తలు కోరగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడ వారు నిరసనకు దిగారు. కాగా, కరోనా సమయంలోనూ చిత్తశుద్ధితో పనిచేసిన ఆశావర్కర్ల మీద సోమవారం పోలీసులు దాడి చేయటం తగదని, ఆ పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో హోమ్ శాఖ బాధ్యతను కూడా చూస్తున్న సీఎం సిగ్గుపడాలని అన్నారు.
ఉద్యమ తల్లే మా తల్లి
హైదరాబాద్, కిరణం : హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి తెలంగాణకు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పిలుపుతో ఆమె మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నియంత పోకడలతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. హుందాగా, నిండుగా ఉన్న తెలంగాణ తల్లిని తీసేసి పేద తల్లిని పెట్టామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారని, తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా అని నిలదీశారు. కాంగ్రెస్ పెట్టిన విగ్రహాన్ని తాము తిరస్కరిస్తున్నామని, ఉద్యమ తల్లే తమ తల్లి అన్నారు. ఈ విషయంలో రేవంత్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని, కానీ పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సొంతమని, అందుకే నాడు ఆ విగ్రహం చేతిలో బతుకమ్మను పెట్టామని ఆమె తెలపారు. తొమ్మిది మంది కవులు, కళాకారులకు సన్మానం, 300 గజాలు స్థలం, కోటి రూపాయలు ఇస్తామని చెప్పిన సీఎంకు తెలంగాణకు గుర్తింపు తెచ్చిన విమలక్క, సంధ్య, ఎరుకల నాంచారమ్మ వంటి వారెవరూ గుర్తుకురాలేదని ఎద్దేవా చేశారు.