ED Raids: భాగ్యనగరంలో మరో మారు ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
Hyderabad: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
సమాచారం మేరకు ఢిల్లీ నుండి ఈడీ అధికారులు హైదరాబాదులో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడి, మూడు ఐటి కంపెనీలు, రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో సోదాలు చేయడం పై రాజకీయ నేతల వెన్నులో చలి మొదలైంది. బంజారాహిల్స్ లో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటిలో, ఉప్పల్ లోని ఓ ఐటి కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా ఈడీ తన సోదాలను ముమ్మరం చేసింది.
లిక్కర్ స్కాంలో ఏ14గా ఉన్న రామచంద్ర పిళ్లైకు సంబంధించి 8 గంటలపాటు ఆయన బ్యాంకు లావాదేవీలు, రాజకీయ నేతల సబంధాల పై ఈడీ ఆరా తీసింది. మరోవైపు ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే మాగంటి శ్రీనివాసుల రెడ్డి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించివున్నారు. ఇందులో చార్టర్ అకౌంటెంట్ బుచ్చిబాబు పాత్ర పై ఈడీ కూపీ లాగుతుంది. రాజకీయ నేతలతో అతనికి ఉన్న సంబంధాలను కూడా వెలికితీసే పనిలో పడింది. పలువురు బడాబాబులకు బుచ్చిబాబు ఆడిటర్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మద్యం కుంభకోణంలో భాగస్వామ్యం ఉందని తొలినుండి భాజాపా నేతలు పేర్కొన్న విషయం అందరికి విదితమే. అయితే ఈడీ నుండి తనకు ఎలాంటి తాఖీదుల అందలేదని కవిత ఖండించివున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పలు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల కంటిమీద కునుకు లేకుండా చేయడం పై సర్వత్రా చర్చ జరుగుతుంది.