Telangana Thalli: తెలంగాణ తల్లి రూపకల్పన.. విగ్రహంపై ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Explains About Telangana Thalli Statue Design: తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయాలు, సంస్కృత్తులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోనికి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండుపూసల హారంతో చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ పోరాటం స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన అహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడిందన్నారు.
కుడి చేతితో జాతికి అభయానిస్తూ.. ఎడమచేతిలో తెలంగాణ మాగణంలో పండే సంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతి, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం.. మన చరిత్రకు దర్పణంగా రూపొందించామన్నారు. తెలంగాణ చిరునామానే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మబలిదానాలు.. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపర్చినట్లు తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలనే లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. చేతులను కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పున:నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత, గొప్ప తాత్వికత ఉందన్నారు.
పీఠంలో నీలి వర్ణం.. గోదావరి, కృష్ణమ్మలు తల్లినిన్ను తడపంగా.. అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకకగా నిలుస్తుందన్నారు. అలాగే ఆకుపచ్చ వర్ణం.. పచ్చని తెలంగాణ నేలల్లో పసిడి సిరులు పండంగా.. అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుందన్నారు. ఇక, ఎరుపు వర్ణం.. మార్పు, ప్రగతికి చైతన్యానికి ప్రతీక అన్నారు. బంగారు వర్ణం.. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుందని చెప్పారు.
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అన్న కాళోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు. తమ బండిపైనే కాదు.. గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబొట్టు వేసుకున్నారన్నారు. అగ్నికీలల్లో తమ దేహాలు భగ్గునా మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణంగా భావించారన్నారు.