Last Updated:

Telangana Thalli Statue: సరికొత్త రూపులో తెలంగాణ తల్లి.. విగ్రహ నమూనాను వెల్లడించిన సర్కారు

Telangana Thalli Statue: సరికొత్త రూపులో తెలంగాణ తల్లి.. విగ్రహ నమూనాను వెల్లడించిన సర్కారు

Telangana Thalli Statue For The Secretariat: తెలంగాణ తల్లిరూపంపై సస్పెన్స్ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, మెడలో కంటె, నుదుటన తిలకం, ఎరుపు రంగు జాకెట్ నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు దిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న వరి సజ్జలున్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. అచ్చమైన తెలంగాణ పల్లె మహిళ రూపులో చూడముచ్చటగా శిల్పులు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

ఇరవై అడుగుల ఎత్తు..
జవహర్‌లాల్ నెహ్రూ ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఆ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్యవిగ్రహాన్ని తయారుచేసింది. 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేసింది. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయం ప్రాంగణానికి తరలించారు. ఇక, తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 17 అడుగులు ఉండగా.. కిందిగద్దె మరో మూడు అడుగులతో రూపొందించారు. మొత్తం
సుమారు రూ.5.3 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటెన్ పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు.

సీఎం చొరవతో..
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా ముఖ్యమంత్రి పలుమార్లు శిల్పులతో భేటీ అయ్యారు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం, సాంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా ఉండాలని సలహాలు ఇచ్చారు. అయితే ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.

రూపకర్తలు వీరే..
ఈ విగ్రహానికి జవహర్‌లాల్ నెహ్రూ ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ రూపకల్పన చేయగా, ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్యవిగ్రహాన్ని తయారుచేసింది. 1966లో జన్మించిన ఎంవీ రమణారెడ్డి ఎన్నో దేశాలను తిరిగి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పొషిస్తూ తన కళద్వారా అందరి మన్ననలు పొందారు. తెలంగాణ అమరజ్యోతి, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న శ్రీ రాజీవ్ గాంధి గారి విగ్రహాలను ఈయనే రూపొందించారు. అయితే అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసిన ప్రొ. గంగాధర్.. మళ్లీ ఆయన కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయడం విశేషం.

ఇదీ విగ్రహానికి స్ఫూర్తి
తెలంగాణ తల్లి శిల్పి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ ప్రజల మాతృమూర్తి. తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర. దశాబ్దాల పోరు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియమ్మ ఆశీర్వచనాలతో సాధించింది ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాధించిన విజయం. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది. గతంలో ఉన్న విగ్రహంలో రాచరికపు హావభావాలు, ధనిక స్త్రీగా, దేవతగా చిత్రీకరించడం జరిగింది. ఒక దేవతామూర్తికి, మాతృమూర్తికి ఎంత వ్యత్యాసం ఉంది. ఈ కొత్త మూర్తి.. సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా నిలవనుంది’ అని పేర్కొన్నారు.

  • ప్రత్యేకతలు
    – ఆకుపచ్చని చీర
    – ఎడమ చేతిలో వరి, మొక్క జొన్న, సజ్జ కంకిలు
    – మెడలో కంటె, చేతికి ఆకుపచ్చ గాజులు
    – బంగారు రంగు అంచు గల ఆకుపచ్చ చీర
    – చిరునవ్వుతో అభయహస్తంతో తెలంగాణకు ఆశీస్సులు
    – నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు
    – తెలంగాణ తల్లి విగ్రహంలో చెవికి కమ్మలు