CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
CM Revanth Reddy Speech at Peddapalli Meeting: తెలంగాణ రాష్ట్రంలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో సీఎం ప్రసంగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పాల్గొన్నారు.
మీ ఆశీస్సులతోనే ఇక్కడ
ప్రజాపాలనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడైన రేవంత్.. నేడు సీఎంగా మీముందు నిలబడ్డాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.
ఆ రహస్యమేంటో.. మరి?
రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలోనే వడ్లు పండుతున్నాయని సీఎం గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర రాలేదని తమ ప్రభుత్వం బోనస్‌గా రూ. 500 అందిస్తోందని గుర్తుచేశారు. గజ్వేల్‌లోని తన పొలంలో ఎకరాకు రూ.కోటి సంపాదిస్తున్నానని అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ, తన పదేళ్ల పాలనలో ఎకరాకు రూ.కోటి ఎలా సంపాదించాలో తెలంగాణ రైతాంగానికి చెప్పకుండానే దిగిపోయారని ఎద్దేవా చేశారు. ఇకనైనా, ఆయన శాసనసభకు వచ్చి, తన మేధావితనాన్ని ప్రజలకు పంచటంతో బాటు ఎకరంలో రూ.కోటి పంట ఎలా పండించారో బహిరంగంగా చెప్పాలని సెటైర్ వేశారు.
ఖమ్మంతో మొదలు..
ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ తెచ్చుకున్నామని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సోనియా గాంధీ ఇచ్చినమాట నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం సోనియా గాంధీకి మొదటి వినతి పత్రం ఇచ్చింది చెన్నారెడ్డేనని గుర్తు చేశారు. ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ ఉద్యమం మొదలైందే కొత్తగూడెం నుంచి అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిని గౌరవిస్తూ.. తాము ఏడాదిలోనే 55,143 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ మీద విమర్శ చేసే బండి సంజయ్, కిషన్ రెడ్డి గుజరాత్‌లో ఎన్ని సర్కారీ కొలువులిచ్చారో లెక్క చెప్పాలని నిలదీశారు.
ఆ ముగ్గురూ.. బీసీ వ్యతిరేకులే..
ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పుడు అందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని బీసీలకు మేలు చేసేందుకు గానూ తమ ప్రభుత్వం కులగణనను నిర్వహిస్తోందని తెలిపారు. అయితే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కులగణనలో ఎందుకు పాల్గొనడంలేదని సీఎం నిలదీశారు. ఈ ముగ్గురూ బీసీ వ్యతిరేకులా? బీసీల ఓట్లతో పదేళ్లు అధికారం అనుభవించిన ఈ నేతలు.. వారికి మేలు జరిగే నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులగణనలో పాల్గొనని వారిని బీసీలంతా బహిష్కరించాలని సీఎం పిలుపునిచ్చారు.
చర్చకు సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో ప్రజల మనసును గెలుచుకుందని సీఎం అన్నారు. తమది ప్రజాపాలన అని, అందుకే ప్రజలు తమ సమస్యలను విజ్ఞప్తుల రూపంలో తమను కలుస్తున్నారని తెలిపారు. ఏడాదిలో 25 వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని, కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిగా ఉందని ఎద్దేవా చేశారు. కుక్క తోక తగిలి పందిరి కూలినట్టుగా కాళేశ్వరం పరిస్థితి ఉందన్నారు.
నియామక పత్రాల ప్రదానం
గ్రూప్-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను పెద్దపల్లి సభలోనే సీఎం అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఫలితాలను విడుదల చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి ఎన్నిక అయినట్లు తెలిపారు.
పెద్దపల్లిపై సీఎం వరాల జల్లు
పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేశారు. ఎలిగేడు మండల కేంద్రానికి పోలీసు స్టేషన్, వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు.