Guinea: కీలక మ్యాచ్‌లో ఘోర విషాదం.. 100మందికిపైగా మృత్యువాత!
Football match turns bloodbath in Guinea: పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జెరెకొరె పట్టణంలో జరుగుతున్న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో రిఫరీ తీసుకున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరూ మైదానంలోకి దూసుకొచ్చారు.
ఒక జట్టు అభిమానులు మైదానంలోకి రావడంతో మరో జట్లు అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య ఘర్షణ తీవ్రంగా మారింది. ఈ సమయంలో ఇరు జట్ల అభిమానులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు దాడులు చేసుకోవడంతో వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి
వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఘోరంగా కొట్టుకున్నారు. కొంతమంది ఏకంగా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకవైపు మైదానంలో గొడవ పడుతుండగా.. మరోవైపు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ మైదానం బయటకు వెళ్లి కొట్లాడుకున్నారు. ఈ ఘటనలో చాలా మంది మృతి చెందడంతో వీధులన్నీ రక్తసిక్తంగా మారింది. ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు పడిఉండడంతో ఆ పరిసరాలు భయాందోళనకరంగా మారాయి.
ఇదిలా ఉండగా, ఈ ఘటన జరిగిన వెంటనే గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఒకరినొకరు దారుణంగా కొట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా మారిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.