Rains Alert: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
Heavy Rains Alert to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం బలపడింది. ఈ అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లోె వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో నవంబర్ 27 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే, అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో తీరం దిశగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రదేశాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే రేపటి నుంచి మూడు రోజుల పాటు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఇదిలా ఉండగా, ఆగ్రేయ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహా సముద్రంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ప్రస్తుతం ట్రింకోమలికి 600కి.మీ, నాగపట్నానికి 880కి.మీ పుదుచ్చేరికి 980కి.మీ, చెన్నైకి 1,050కి.మీల దూరంలో కేంద్రీకృతమూందని తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని పేర్కొంది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.