YSRCP: వైసీపీకి భారీ షాక్.. 16 మందికి నోటీసులు
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. అర్జున్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డి ఇద్దరూ కూడా దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల కడపకు చెందిన వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవీంద్రరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విద్వేష ప్రచార సారథి.. భార్గవ్
వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌తోపాటు మరో కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను నియమించుకుని… వారిని వైసీపీ సోషల్ మీడియా కోసం వాడుకున్నారు. వీరిలో ఐడ్రీమ్ నుంచి 60 మంది, అవినాశ్ రెడ్డి పీఏ బండి రాఘవ రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి ద్వారా 65 మంది ఉన్నారు. వీరికి అప్పటి ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించి డబ్బులు ఇచ్చే వారు. వీరికి 40 యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. 400లకుపైగా సోషల్ అకౌంట్ హ్యాండిల్స్‌ను నిర్వహించారు. తాడేపల్లిలోని పీవీఎస్ ఐకాన్ బిల్డింగ్ మూడో ఫ్లోరులోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నుంచి వీరంతా మొత్తం కార్యకలాపాలు జరిపారు. భార్గవ్ నాయకత్వంలోనే పంచ్ ప్రభాకర్, జగనన్న సైన్యం (వెంకటేశ్ బాడి), ఇడ్లీ సాంబార్ (హరికృష్ణా రెడ్డి), రెడ్డిగారి అమ్మాయి వంటి ఖాతాలతోపాటు… బేతంపూడి నాని, కేసరి రాజశేఖర్ రెడ్డి, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్ కృష్ణా రెడ్డి, మలకా అమరనాథ్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్, షేక్ జాను, జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల, శ్రీనివాసరెడ్డి, జింకల రామాంజనేయులు, ఎన్.బాలాజీ రెడ్డి, భార్గవ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి… తదితరులు సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన సందేశాలు పోస్టు చేసినట్లు విచారణలో గుర్తించారు.