Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం
Road Accident in Anantapur District: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా, దవాఖానకు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పనికి పోయి..
కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. పనులు ముగించుకొని తిరిగి వెళ్తన్నారు. ఈ క్రమంలో వారు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో రాంజమనమ్మ (48), బాల తాతయ్య (55) అక్కడిక్కడే మృతి చెందారు. డి. నాగమ్మ, పెద నాగన్న దవఖానకు తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ కొండమ్మ, జయరాముడు, చిననాగన్నలు మరణించారు. మిగతా క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ జగదీశ్, డీఎస్సీ వెంకటేశ్వరులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.5 లక్షల పరిహారం
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలి పనికి పోయి ఇంటికి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.