Last Updated:

MLC Kavitha: ప్రాణాలు పోతున్నా పట్టదా? 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

MLC Kavitha: ప్రాణాలు పోతున్నా పట్టదా? 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

MLC Kavitha Fires on Congress Government: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల్లో ఇప్పటి వరకు 42మంది విద్యార్థులు మృతిచెందారని పేర్కొన్నారు. పిల్లల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నాయి..
ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ ఒక్క పాఠశాలను చూసినా ఏదో ఒక ఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. అన్ని సంక్షేమ శాఖలు ముఖ్యమంత్రి వద్ద ఉండడం వల్ల సమయం వెచ్చించలేకపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందని సూచించారు.

 సమీక్ష చేసిన మరునాడే ..

నారాయణపేట హాస్టల్లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత సీఎం రేవంత్ సమీక్ష చేసిన మరునాడే అలాంటి మరో ఘటన జరగడం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఐఐటీ, ఐఐఎంకు వెళ్లాలా లేకపోతే ఎవరెస్టు అధిరోహించాలా అన్న ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో వెళ్లిన సందర్భాన్ని తెలంగాణ సమాజం చూసిందని గుర్తు చేశారు.