Last Updated:

AP Volunteer News: వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన.. కొనసాగింపుపై మంత్రి ఏమన్నారంటే?

AP Volunteer News: వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన.. కొనసాగింపుపై మంత్రి ఏమన్నారంటే?

AP Government Clarifies over Volunteers Continuation: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన వెలువడింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంపై ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వేతనాల అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. రాష్ట్రంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదన్నారు. 2023 సెప్టెంబర్ నుంచి ఈ వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్లే.. వాలంటీర్లతో రాజీనామా చేయించారని, అమల్లోనే లేని ఈ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని మంత్రి అన్నారు. ఇలా వాలంటీర్ల రెన్యువల్ విసయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఆనాటి వైసీపీ సర్కార్.. వాలంటీర్లతో పాటు అటు ప్రజలను, ఇటు నమ్ముకున్న కార్యకర్తలను మోసగించిందని మంత్రి వెల్లడించారు. అయితే ఈ విషయంపై వాలంటీర్లకు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని మంత్రిని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని.. వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగేవాళ్లమని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కనీసం జీఓలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే వాలంటీర్లను కొనసాగిస్తూ జీఓ తీసుకొచ్చింది. తర్వాత సెప్టెంబర్‌లో రెన్యువల్ చేయలేదు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం జీఓ తీసుకొచ్చింటే.. కూటమి ప్రభుత్వం కూడా వాళ్లను కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లమని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మే వరకు మాత్రమే వాలంటీర్లకు వేతనాలు చెల్లించామని, వాలంటీర్ల వ్యవస్థపై నమ్మకం ఉందని మంత్రి తెలిపారు.