Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు – ఆ కేసులో వర్మ పటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
AP HC Shock to Ram Gopal Varma డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తనపై నమైదన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల అక్రమ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆర్జీవీ తన పటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో నేడు ఆయన పటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పటిషన్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు నుంచి తాము రక్షించలేమని వర్మకు స్పష్టం చేసింది. పోలీసుల నుంచి అరెస్టు, ఆందోళన ఉంటే బెయిల్ పటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఈ అభ్యర్థనను కూడా పోలీసుల ముందు చేసుకోవాలని ఆర్జీవీకి న్యాయస్తానం స్పష్టం చేసింది.
కాగా వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్‌లు పెట్టడమే కాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ స్వయంగా హైదరాబాద్ వచ్చిన ఆర్జీవీకి ఆయన నివాసంలో ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పువెలువరించింది.