Published On:

New Telangana BJP Chief: అనుచరుడే అధ్యక్షుడు.! ఎంపికలో కిషన్ రెడ్డి మార్క్.!

New Telangana BJP Chief: అనుచరుడే అధ్యక్షుడు.! ఎంపికలో కిషన్ రెడ్డి మార్క్.!

New Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తన మార్క్‌ను చూపించారు. నిన్న మొన్నటి వరకూ అధ్యక్ష బరిలో ఉన్న హేమాహేమీలను కాదని, తన అనుచరుడైన రామచందర్‌రావును ఎంపిక చేసేలా పావులు కదిపారు. పార్టీపై కిషన్‌రెడ్డికి పట్టులేదని విమర్శిస్తున్న వాళ్లంతా సైలెంట్‌ అయ్యేలా.. తన చరిష్మాను చూపించారు. రాష్ట్రంలో బీజేపీ క్రమక్రమంగా సత్తా చాటుతున్న వేళ పార్టీపై తన పట్టు సడలిపోకుండా.. తనదైన శైలిలో వ్యవహరించి, విమర్శకులు సైతం విస్తుపోయేలా చేశారు. ఆఖరికి బీసీ కులగణనకు సైతం సిద్ధమైన బీజేపీ అధిష్టానాన్ని.. ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రంలో బీసీలను కాదని, తన మాట నెగ్గించుకుని తన స్థాయిని చాటారు.

ఈ సారి టీ-బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు.. బీసీ వర్గాల్లో బలమైన నాయకులుగా లైమ్‌ లైట్‌లో ఉన్న ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌.. ఎన్నిక అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. మహిళా కోటాలో డి.కె అరుణ కూడా టీ-బీజేపీ అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఎంపిక కావడంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న తరుణంలో ‘బీసీ’కి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకోవడంలో కిషన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో టీ-బీజేపీ అధ్యక్ష పదవి మరోసారి ఉన్నత వర్గానికి చెందిన రామచందర్‌రావుకు దక్కింది. టీ-కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో బీసీ అయిన మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఉండటం కూడా బీజేసీ ప్లాన్‌ మార్చుకోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా కిషన్‌రెడ్డి టీ-బీజేపీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టగా.. ఆ ఎన్నికల్లో బీజేపీ ఊహించిన ఫలితాలు రాబట్టలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ తెలంగాణలో బీజేపీకి భారీ మైలేజ్‌ తీసుకురాగా.. సడన్‌గా తప్పించడం ఫలితాలపై ప్రభావం చూపించింది. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుని బీజేపీ తన సత్తా చాటింది. ఈ ఫలితాలు కిషన్‌రెడ్డి టీ-బీజేపీ చీఫ్‌గా ఉండగానే సాధ్యమయ్యాయి. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సారి బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని భావించినా.. ఈటల లాంటి నాయకులకు చెక్‌ పెడుతూ తన అనుచరుడైన రామచందర్‌రావుకే పగ్గాలు దక్కేలా చేసి, వైరి వర్గానికి షాక్‌ ఇచ్చారు.

ఇక తెలంగాణలో బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరుగాంచిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సైతం కిషన్‌రెడ్డి సైలెంట్‌గా చెక్‌ పెట్టారు. మూడేళ్లుగా కిషన్‌రెడ్డి నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్న రాజాసింగ్‌ను కాషాయ శిబిరాన్ని వీడి వెళ్లేలా చేశారు. టీ-బీజేపీ ముఖ్య పదవుల్లో కోవర్టులున్నారంటూ.. అందువల్లే గత ఎన్నికల్లో బీజేపీకి అధికారం దూరమయ్యిందంటూ రాజాసింగ్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్నవారికి కాకుండా.. తమకు అనుకూలంగా వారికి సీట్లు, పదవులు ఇస్తున్నారని విమర్శించారు. దీంతో ఎప్పటికప్పుడు తలనొప్పిగా మారుతున్న రాజాసింగ్‌ను అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో తనదైన శైలిలో అడ్డుతొలగించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో తనను సులువుగా తీసిపారేసే పరిస్థితి ఉండదని నిరూపిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌లో తనకున్న బలమైన ప్రాతినిథ్యాన్ని వాడుకుని పార్టీపై పట్టు నిలుపుకున్నారు.

ఇవి కూడా చదవండి: