Kishan Reddy : బడేమియా మాటలకు చోటేమియా వత్తాసు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Union Minister Kishan Reddy : పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్‌కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం సిగ్గు చేటన్నారు. శుక్రవారం ఢిల్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రాహుల్ అడగాల్సింది ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు కూలాయని కాదని, ఎంతమంది ఉగ్రవాదులు మృతిచెందారని అడిగితే బాగుండేదని చురకలు అంటించారు. ఎన్ని రఫెల్ విమానాలు కూలయని లెక్క చెప్పాలని రాహుల్, రేవంత్‌రెడ్డిలు అడుగుతున్నారని తెలిపారు. రాహుల్‌కు 55 ఏళ్లు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాలేదని మండిపడ్డారు. బడేమియా మాటలకు వత్తాస్తుగా చోటేమియా రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఎంపీల బృందాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిల మాటలను దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి మూడు రోజులు ఉన్నా రాహుల్ గాంధీ దర్శనం దక్కలేదన్నారు. అవమానానికి గురై వెనక్కి పోయారని దుయ్యబట్టారు. భారత్ సైనికులను తక్కువ చేసి చేసి మాట్లాడటం దర్మార్గమన్నారు.
దేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. రేవంత్‌రెడ్డి మన పాక్ అని మాట్లాడారని, రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పీఓకేను స్వాధీనం చేసుకుంటారని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. ఈ జన్మలో కూడా రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం రాదన్నారు. పాకిస్థాన్ ఎటువంటి దాడులు చేసినా మోదీ సర్కారు ఊరుకోలేదన్నారు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయన్నారు. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయన్నారు. రాహుల్ గాంధీ దుర్బుద్ధితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత్ పాకిస్థాన్, చైనాలతో యుద్ధం వచ్చినా ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ప్రజలందరూ రాజకీయాలు కులాలు, మతాలు పక్కన పెట్టి ఒక్కటిగా నిలబడ్డారని పేర్కొన్నారు.
పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలంతా ఆకాక్షించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టామన్నారు. ఆపరేషన్ సిందూర్ ఎవరికి తెలియని ఘటన కాదన్నారు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అందరికీ తెలుసన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో 23 నిమిషాల్లో పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారని గుర్తుచేశారు. పాకిస్థాన్ ప్రధానితో కూడా ఒప్పుకున్నారని తెలిపారు. పాకిస్థాన్‌పై చేసిన దాడుల వీడియోలు ప్రపంచం ముందు సైన్యం పెట్టిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.