Published On:

Kishan Reddy : దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్

Kishan Reddy : దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్

Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌‌ పార్టీకి సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల జరిగిన నష్టం, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది.

 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల వద్దకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలన గురించి వివరించాలని దిశానిర్దేశం చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండు కలిసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాయని దుయ్యబట్టారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని ఆకాంక్షించారు.

 

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం అయిందన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి డబ్బులు తెలంగాణ నుంచి వెళ్తున్నాయని ఆరోపణలు చేశారు. బీజేపీ తప్ప తెలంగాణను ఏ పార్టీ కాపాడలేదని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలు, అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

ఇవి కూడా చదవండి: