Revanth Reddy Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్.. కేబినెట్ విస్తరణపై చర్చలు
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా తిరుగుతున్నారు. కాగా శనివారం నిర్వహించిన నీతి ఆయోగ్ మీటింగ్ కోసం గత శుక్రవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఇంకా హస్తినలోనే మకాం వేశారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పలు పథకాలకు ఆర్థికసాయంపై చర్చించారు. తర్వాత కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అయితే సీఎం రేవంత్ పార్టీ నేతలతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు వంటి అంశాలపై పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో సమావేశమై మాట్లాడినట్టు సమాచారం. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. నిన్న రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 8.40 వరకు వీరి మధ్య సమావేశం జరిగింది. అయితే సమావేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జరిగే భేటీలో ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అనుమతితో రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాగా కేబినెట్లో ఖాళీగా ఉన్న ఐదు బెర్తుల ఖారుపై నేతల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. సామాజిక న్యాయం పాటించేలా పలు వర్గాలకు చెందిన నేతల పేర్లను కేసీ వేణుగోపాల్ పరిశీలించి వాటిని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీతోపాటు రెడ్డి సామాజికవర్గం నుంచి తుది జాబితాను ఆయన రికార్డు చేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పీసీసీ నూతన కార్యవర్గంపైనా చర్చించారు. ఈసారి పరిమితంగా కార్యవర్గ కూర్పు చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు చోటు కల్పించనున్నట్టు సమాచారం.
అయితే ఇవాళ మరోసారి భేటీ నిర్వహించి చేపట్టాల్సిన విధివిధానాలపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తర్వాత ఫైనల్ లిస్ట్ ను రూపొందించే దిశలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో మరో రెండు రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నేటి భేటీకి రావాలని సమాచారమిచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ తయారైనా తుది జాబితాను.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతితో రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు కేసీ వేణుగోపాల్ తో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ లేఖ వెనుక ఉన్న రాజకీయ ఆంతర్యం. బీఆర్ఎస్ లో మారిన పరిణామాలు. ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.