ఫిఫా వరల్డ్ కప్ 2022 : ఇదేం ఫైనల్ రా బాబు…నరాలు తెగే ఉత్కంఠ మధ్య … సాకర్ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా
Fifa World Cup 2022 : ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల సాకారం అయ్యింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై నెగ్గింది.
నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా 3-3 గోల్స్ తో నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ అర్జెంటీనా నాలుగింటికి నాలుగు గోల్స్ వేయగా.. ఫ్రాన్స్ మాత్రం నాలుగింటిలో రెండే వేసింది. దీంతో అర్జెంటీనా కప్ గెలుచుకొని మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలికింది. ఇక మ్యాచ్ ను పరిశీలిస్తే టీం వర్క్ తో అర్జెంటీనా అదరగొట్టింది అని చెప్పాలి. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు సమానంగా పాయింట్లు సాధించాయి. అర్జెంటీనా తరఫున లియోనల్ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. డి మరియ (36వ నిమిషంలో) ఒక గోల్ వేశాడు. ఇక ఫ్రాన్స్ తరఫున ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ (80వ, 81వ, 118వ నిమిషాల్లో) గోల్స్ వేశాడు.
ఆట తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా అదరగొట్టింది. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధ భాగంలో తొలి 35 నిమిషాల పాటు అర్జెంటీనాదే పైచేయి సాగిన… 80వ నిమిషం నుంచి మ్యాచ్ ను మార్చేశాడు ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి స్కోర్ ను సమం చేయడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది.
అదనపు సమయం రెండో అర్ధ భాగంలో మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం ఇచ్చాడు. అయితే ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీని గోల్ గా మలచిన ఎంబాపే స్కోర్ ను మరోసారి సమం చేశాడు. ఇక ఆఖర్లో ఫ్రాన్స్ కు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్ దానిని అడ్డుకుని మ్యాచ్ ను పెనాల్టీ షూటౌట్ కు తీసుకెళ్లాడు. ఈ ఉత్కంఠ పరిణామాల ఇందులో అర్జెంటీనా 4 పాయింట్లు సాధించగా… ఫ్రాన్స్ రెండు మాత్రమే చేయగలిగింది. ఇక దీంతో అర్జెంటీనా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇక ఈ అద్బుత విజయంతో మెస్సీ తన కెరీర్ కి గుడ్ బై పలికాడు.